విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం
నయీంనగర్: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. శనివారం రాత్రి హనుమకొండ కేయూ జంక్షన్‌లో విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలతో చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు.
కార్మికుల సమస్యలపై వినతి
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కార్మికుల టెండర్ కాలం ముగిసినా టెండర్ పిలవడం లేదని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఎంజీఎంను సందర్శించిన కల్వకుంట కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు కేవలం రూ.11 వేల వేతనం మాత్రమే వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు 18,500 మంది కార్మికులు పనిచేస్తున్నారని, కనీస వేతనం అమలయ్యేలా చూడాలని కవితను వేడుకున్నారు.
లైబ్రరీని సందర్శించిన కవిత
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులతో ముచ్చటించారు. లైబ్రరీలో వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగల పక్షాన ప్రభుత్వంతో తాను ఉద్యమిస్తానని ఆమె అన్నారు.


