గోవిందా..గోవిందా..
రేగొండ: గోవింద నామస్మరణతో బుగులోని గుట్ట రెండో రోజు మార్మోగింది. రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో గల బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర గురువారం కూడా భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది రావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి వెలుగుల్లో స్వామి వారి దర్శనానికి భక్తులు రాత్రి, పగలు తేడా లేకుండా బారులు దీరారు. కోరికలు తీర్చాలని తలానీలు సమర్పించుకున్నారు. గండ దీపంలో నూనె పోసి దీపారాధన చేశారు. జాతరకు వచ్చిన భక్తులు ముందుగా ఇప్పచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి జాతర ప్రాంగణంలో విడిది చేశారు. జాతర ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానాలు ఆచరించి గుట్ట కింద ఉన్న శివాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. మండలం నుంచే కాకుండా ములుగు, హుజూరాబాద్, వరంగల్, మంథని, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తరలొచ్చి మొక్కులు సమర్పించారు. సుమారు 20 వేల మంది భక్తులు తరలొచ్చినట్లు ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు.
మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు..
ఉమ్మడి వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు బుగులోని వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, రేగొండ పీహెచ్‌సీ వైద్యాధికారి హిమబిందు ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోలీసుల బందోబస్తు..
జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఐ కరుణాకర్ రావు, ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బందోబస్తు చర్యలు పర్యవేక్షించారు.
బుగులోని గుట్టలో మార్మోగిన
గోవింద నామస్మరణ
జాతరకు పోటెత్తిన భక్తజనం
భక్తులతో కిటకిటలాడిన
వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి
గోవిందా..గోవిందా..


