బంద్‌ ప్రచారం.. మార్కెట్‌కు తగ్గిన పత్తి రాక | - | Sakshi
Sakshi News home page

బంద్‌ ప్రచారం.. మార్కెట్‌కు తగ్గిన పత్తి రాక

Nov 7 2025 6:37 AM | Updated on Nov 7 2025 6:37 AM

బంద్‌ ప్రచారం..  మార్కెట్‌కు తగ్గిన పత్తి రాక

బంద్‌ ప్రచారం.. మార్కెట్‌కు తగ్గిన పత్తి రాక

వరంగల్‌: సీసీఐ నిబంధనలతోపాటు పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో 6వ తేదీ నుంచి కొనుగోళ్ల బంద్‌ చేస్తామని మిల్లర్స్‌, ట్రేడర్స్‌ పిలుపుతో వరంగల్‌ మార్కెట్‌కు గురువారం పత్తి అతి తక్కువ వచ్చింది. గ్రామాల్లో బంద్‌ పిలుపు ప్రచారం కావడంతో ఎక్కువ మంది రైతులు మార్కెట్‌కు పత్తి తీసుకురాలేదని తెలిసింది. ఈ నెల 4వ తేదీన సీసీఐ 2,702క్వింటాళ్లు, ప్రైవేట్‌ వ్యాపారులు 6,094 క్వింటాళ్లు మొత్తం.. 9,796 క్వింటాళ్లు కొనుగోళ్లు జరిగాయి. గురువారం(6వతేదీ) సీసీఐ 2,564 క్వింటాళ్లు కొనుగోలు చేయగా మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు కేవలం 1,863 క్వింటాళ్లు మొత్తం.. 4,427 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అంటే బంద్‌ ప్రభావంతో పత్తి సుమారు 5,369 క్వింటాళ్లు తక్కువ తీసుకొచ్చారు. బంద్‌ వాయిదా పడడంతో రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హాస్టళ్ల సమస్యలు

పరిష్కరించాలి

కేయూలో విద్యార్థుల ధర్నా

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలన భవనం వద్ద ధర్నా చేపట్టారు. కామన్‌మెస్‌లో మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, కామన్‌మెస్‌లో జరుగుతున్న అవకతకవలపై విచారణ జరిపించాలన్నారు. గర్ల్స్‌ హాస్టళ్లలోకి ఎలుకలు వస్తున్నాయని, దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనతో పోలీసులు పరిపాలన భవనం చేరుకుని మొహరించారు. ఆందోళన ఎక్కువగా అవుతుండడంతో రిజిస్ట్రార్‌ రామచంద్రం.. విద్యార్థులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మందశ్రీ కాంత్‌, కేయూ అధ్యక్షుడు చెన్నూరి సాయికుమార్‌, కార్యదర్శి బిరెడ్డి జస్వంత్‌, పీడీఎస్‌యూ కేయూ అధ్యక్షుడు బి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవకతవకల ఆరోపణలపై

విచారణ కమిటీ..

హాస్టళ్ల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అకడమిక్‌ కమిటీహాల్‌లో వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల బాధ్యులు హాస్టళ్లల్లోని వివిధ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ నుంచి కళాశాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరగా అందుకు వీసీ స్పందించి హామీ ఇచ్చారు. హాస్టళ్ల నిర్వహణ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాల బాధ్యులు ఆరోపణలు చేయగా అందుకు సంబంధించి విచారణ కమిటీని నియమిస్తామని వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. ఆరోపణలు నిరూపణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థి సంఘాల బాధ్యులకు తెలియజేసినట్లు రిజిస్ట్రార్‌ రామచంద్రం వెల్ల డించారు. సమావేశంలో కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ ఎల్‌.పి. రాజ్‌కుమార్‌, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి. మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలోని సుబేదారిలోని ‘లా’ కళాశాల హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై కూడా చర్చించారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాలని పలువురు విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement