పెళ్లి పత్రికలు పంచుతూ పరలోకాలకు..
బచ్చన్నపేట : ఆకాశమంత పందిరి.. భూదేవంతా పీట వేసి అతిరథ మహారథల సమక్షంలో తన ఒక్కగానొక్క కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి భావించాడు. అనుకున్నట్లుగానే తన గారాల పట్టీ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ నెల 13న వేదమంత్రాల సాక్షిగా తన బుజ్జి తల్లిని అత్తగారింటికి సగౌరవంగా సాగనంపాలనుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. పెళ్లి పత్రికలు పంచడానికి బైక్‌పై వెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ సమీపంలో గురువారం డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని ఆర్టీవన్ కాలనీకి చెందిన బండి శ్రీనివాస్ (50) పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీనివాస్, లావణ్య దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. తన కూతురుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్టె గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఈ నెల 13న వివాహం జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి పత్రికలు పంచడానికి గురువారం బైక్‌పై సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో తమ బంధువుల ఇంటికి వచ్చాడు. పత్రిక ఇచ్చిన అనంతరం జనగామ– సిద్దిపేట జాతీయ రహదారిలోని బచ్చన్నపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆలీంపూర్ సమీపంలో పోచమ్మ గుడి దగ్గర బైక్, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై ఎస్.కె. అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని జనగామ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం..
వారం రోజుల్లో కూతురి వివాహం చేయాల్సి ఉంది. ఈ సమయంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకుంటున్న తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, వరుడి బంధువుల రోదనలు మిన్నంటాయి.
బైక్, డీసీఎం ఢీ.. వ్యక్తి దుర్మరణం
ఆలీంపూర్‌లో ఘటన
పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం
13న కూతురి పెళ్లి..


