అండర్ బ్రిడ్జి నడక దారి ఆక్రమణ
ఇటేటు.. రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్లు ఉంది కొందరు వ్యాపారుల తీరు. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద వ్యాపారం చేసుకునే ఒకరు.. ఆ బ్రిడ్జికింద నడక దారిని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేపట్టాడు. దీనిపై స్థానికులు రైల్వే అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జికింద నీరు ఉన్నసమయంలో సొరంగంవంటి ఈ నడకదారినుంచి స్థానికులు, ద్విచక్రవాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఆ దారిని ఆక్రమించి షెడ్డు వేస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. – ఖిలా వరంగల్


