కళ్లకు కట్టిన నిర్లక్ష్యం
హన్మకొండ: అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ ఫొటో. నాలా జాలీ గేటుకు అల్లుకున్న గుర్రపు డెక్క, చెత్తాచెదారం ఇప్పటికీ తీయని దుస్థితి. ఇదేమీ నీటిపారుదల శాఖ అధికారులకు కనిపించడం లేదు. ముంపు ప్రాంత కాలనీ వాసులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండలోని వివేక్‌నగర్, అమరావతి నగర్, టీఎన్జీవోస్ కాలనీ–2 వాసులు మందు నుంచి చెబుతున్నట్లుగానే జాలీ గేట్‌కు గుర్రపు డెక్క, చెత్తాచెదారం అల్లుకుపోయి నాలాలో బ్యాక్ వాటర్ పెరిగి వంద ఫీట్ల రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పాటు పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరద తగ్గి ముంపు కాలనీవాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వరద పోటెత్తిన గత గురువారం సాయంత్రం జాలీ గేట్‌లో పై వాటిని మాత్రమే తొలగించి దిగువన ఉన్నవాటిని పట్టించుకోకపోవడంతో వరద ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. దీంతో గోపాల్‌పూర్ చెరువు నుంచి బయటకు వస్తున్న పాత నాలా నుంచి ప్రవహిస్తోంది. గుర్రపు డెక్కతోపాటు చెత్త చెదారం అల్లుకోవడంతో డక్ట్ అండ్ డ్రెయిన్‌నుంచి చుక్క నీరు పోవడం లేదని వివేక్‌నగర్, అమరావతి నగర్ వాసులు తెలిపారు. మరో వైపు వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెప్తున్నా నీటిపారుదల శాఖ అఽధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని వివేక్‌నగర్, టీన్జీవోస్ కాలనీ అభివృద్ది కమిటీ బాధ్యులు తుపాకుల దశరథం, పింగిళి అశోక్ రెడ్డి తెలిపారు.
తీరు మారని నీటిపారుదల శాఖ అధికారులు


