
‘ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు’ పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్: నగరానికి చెందిన చరిత్రకారులు అరవింద్ ఆర్య పకిడే, కట్టా శ్రీనివాస్ రచించిన ‘ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు ’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ రాజమహల్‌లో బస్తర్ రాజు మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్, రాజమాత ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ రమణ్‌సింగ్ పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రమణ్‌సింగ్ మాట్లాడుతూ ఈ పుస్తకం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలను తెలియజేస్తుందని, విలువైన చారిత్రక గ్రంథాన్ని వెలువరించిన అరవింద్, శ్రీనివాస్ కృషి అభినందనీయమన్నారు. మహారాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ వరంగల్ నుంచి బస్తర్ వరకు ఉన్న చారిత్రక కట్టడాలు, వారసత్వ విశేషాల గురించి పుస్తకం తెలుపుతుందని, భవిష్యత్ తరాలకు వారధిగా నిలుస్తుందన్నారు. చరిత్రకారుడు అరవింద్ ఆర్య మాట్లాడు తూ ఈ పుస్తకంలో కాకతీయ వంశంపై పరిశోధనా త్మక విశ్లేషణలు ఉన్నాయని, ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ఆధారాలతో వివరించామన్నారు.