
వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
నయీంనగర్/కాజీపేట: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) వెల్‌నెస్ సెంటర్ వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సెంటర్ ఏర్పాటుకు గురువారం ‘కుడా’ కార్యాలయంలో పైఅంతస్తు, కాజీపే ట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఖాళీ భవనాలను వరంగల్ ఎంపీ కడియం కావ్య, సీజీహెచ్‌ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణి పరిశీలించారు. వీటితోపాటు దూరదర్శన్ కార్యాలయం వసతి గృహాన్ని పరిశీలించి భవన స్థితిగతులు, విస్తీర్ణం వంటి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ భవనం ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తిచేసి సెంటర్ ప్రారంభానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీఓ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.