
12న మిడ్కో సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ సభ
హన్మకొండ కల్చరల్: దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యమకారిణి, రచయిత గుముడవెల్లి రేణుక (మిడ్కో) సమగ్ర సాహిత్యం పుస్తకాల ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు అస్నాల శ్రీనివాస్, బిల్ల మహేందర్, బోనగిరి రాములు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న (ఆదివారం) ఉదయం 10గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో జరుగనున్న సభలో పలువురు వక్తలు ప్రసంగిస్తారని, ఉమ్మడి వరంగల్ జిల్లా సాహితీవేత్తలు, ప్రజాస్వామికవాదులు, పరిశోధక విద్యార్థులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో న్యాయశాస్త్రం పూర్తిచేసిన కడవెండికి చెందిన గుముడవెల్లి రేణుక మూడు దశాబ్దాల పాటు ప్రజాఉద్యమాలలో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశారు. తాను పాల్గొన్న, తనకు ప్రేరణనిచ్చిన ఉద్యమాలను పరిశీలించి మిడ్కో, దమయంతి వంటి కలం పేర్లతో కథలు, వ్యాసాలు రాసి 2025 మార్చి 31న చనిపోయారు. ఈ మేరకు అనురాధ సంపాదకత్వంలో, విరసం ప్రచురణలో వెలువరించిన మెట్టమీద, ప్రవాహం, విముక్తిబాటలో అనే మూడు సంపుటాలను ఆదివారం ఆవిష్కరించనున్నారు.