
ప్రాణదాత.. యుగంధర్
రఘునాథపల్లి : ఓ యువకుడు తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. తన అవయవాలు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించి అందరితో జేజేలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన గాదె మురళీధర్, శోభ దంపతుల కుమారుడు యుగంధర్ (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దసరా పండుగకు స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఈ నెల 5న బైక్‌పై మేనత్త కుమారుడు చందుతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ఉప్పల్ దాటాక అదుపు తప్పి కిందపడింది. దీంతో యుగంధర్ తలకు తీవ్ర గాయాలుకాగా స్థానికులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న యుగంధర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గురువారం ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా, పుట్టెడు దుఃఖంలోనూ వారు మానవత్వం మరువలేదు. కొడుకు బ్రెయిన్ డెడ్ కావడంతో తన అవయవదానానికి అంగీకరించారు. దీంతో వైద్యులు వెంటనే యుగంధర్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కళ్లు సేకరించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు రోగులకు అమర్చారు. ఫలితంగా యుగంధర్ తాను మరణించి ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపగా.. తల్లిదండ్రుల నిర్ణయాన్ని అందరూ అభినందించారు. తమ తనయుడు ఆరుగురికి ఊపిరి పోశాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, యుగంధర్ మృతదేహానికి ఆస్పత్రి సిబ్బంది గౌరవ వందనం చేసి అంబులెన్స్‌లో స్వగ్రామానికి పంపారు. యుగంధర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి తీవ్రగాయాలు
యశోదలో చికిత్స పొందుతూ
బ్రెయిన్ డెడ్
అంతటి బాధలోనూ ఆరుగురికి
అవయవ దానం చేసిన తల్లిదండ్రులు

ప్రాణదాత.. యుగంధర్