
ప్రయాణం ఇక సాఫీ!
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కింద అప్పటి ప్రజల రవాణా కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించిన బ్రిడ్జి నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న రేలింగ్ ముట్టుకుంటే ఊడిపడేలా ఉంది. ఏటా ఎంతో కొంత నిధులు మంజూరు అవుతున్నప్పటికీ గోడలకు రంగులు వేయడంతోనే సరిపెడుతున్నారు. బ్రిడ్జి కింది వైపు నుంచి రాకపోకలు సాగించే వెంకటాద్రి నగర్ కాలనీవాసులకు ఈ గోడలు పెను ప్రమాదంగా మారాయి. పెళ్లలు పడి స్థానికులు, బాటసారులు స్వల్పంగా గాయపడిన ఘటనలు అనేకం. వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రిడ్జిపై గుంతలు పడడం సర్వసాధారణమైంది. ఈ గుంతలను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. వాహనదారుల బాధలను చూడలేక ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని గుంతలను పూడుస్తున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే నాయిని
కాజీపేట రైల్వే బ్రిడ్జి వల్ల కలుగుతున్న ఇబ్బందులను చూసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.59 లక్షలు మంజూరు చేయించారు. ఈనిధులతో బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులకు అంచనాలు తయారు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో చాలాకాలం తర్వాత బ్రిడ్జికి పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగనున్నాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు చేయడంలో నిమగ్నమయ్యారు.
రూపు మార్చుకోనున్న కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్
మరమ్మతులకు
రూ.59 లక్షలు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు

ప్రయాణం ఇక సాఫీ!