
సీఈఏ నిబంధనలు తప్పక పాటించాలి
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (సీఈఏ) నిబంధనలు పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మంగళవారం నగరంలోని కనెక్ట్ డయాగ్నస్టిక్స్, విజేత స్కాన్స్ డయాగ్నోస్టిక్స్‌లను క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా కేంద్రాల అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. రేడియేషన్‌కు సంబంధించి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి పత్రాలు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. సీఈఏ నియమాల ప్రకారం ధరలు నిర్ణయించే అధికారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి లేదన్నారు. డయాగ్నోస్టిక్స్ సెంటర్లు, హాస్పిటల్‌ల్లో తాము తీసుకునే ఫీజు, టెస్టులకు సంబంధించి ధరలను తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. యాజమాన్యాలు ప్రజలకు ఇబ్బంది కల్గ కుండా మానవతా దృక్పథంలో వ్యవహరించి సేవలందించాలన్నారు. టారిఫ్ లిస్ట్ ప్రదర్శించని విజేత స్కాన్స్ డయాగ్నస్టిక్స్ కేంద్రానికి నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్నకుమార్, మురళి పాల్గొన్నారు.