ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధించిన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసి కొనుగోలు పూర్తయిన వెంటనే కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తరలింపులో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ వై.వి.గణేష్, డీఆర్‌డీఓ మేన శ్రీను, డీసీఎస్‌ఓ కొమురయ్య, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, డీఏఓ రవీందర్ సింగ్, సహకార అధికారి సంజీవరెడ్డి, మార్కెటింగ్ అధికారి అనురాధ, డీపీఎం ప్రకాష్ పాల్గొన్నారు.
జిల్లా పేరు నిలబెట్టాలి
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు నివారణ మందుల అమ్మకాల్లో వరంగల్ జిల్లాకు మంచి పేరు ఉందని, దీనిని ఇలాగే కొనసాగించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సీడ్, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ డీలర్స్, వివిధ కంపెనీ ప్రతినిధులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి విత్తన, ఎరువులు, పురుగు మందులు తీసుకెళ్తుంటారని, డీలర్లు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. దుకాణాల ద్వారా చేపట్టే క్రయవిక్రయాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల విక్రయాలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, డీఏఓ రవీందర్ సింగ్, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, సతీష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య


