విద్యుత్ భద్రత పాటించాలి
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ఖిలా వరంగల్: విద్యుత్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖ భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం వరంగల్ రంగశాయిపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎన్పీడీసీఎల్ వరంగల్ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు పెద్దపీట వేసి వినియోగదారులు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, అధికారులు, సిబ్బందికి రక్షణ పరమైన పరికరాలు అందజేస్తున్నామని చెప్పారు. ఏదైనా సమస్య వస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జేఎల్‌ఎం నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతమ్‌రెడ్డి, డీఈ టెక్నికల్ ఆనందం, డీఈ ఆపరేషన్స్ మల్లికార్జున్, ఏడీ చంద్రమౌళి, సురేష్, కిషోర్ పాల్గొన్నారు.


