నినాదాలు చేస్తున్న బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు సురేష్, నాయకులు
హన్మకొండ: బీసీ వర్గాలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించిన అనంతరమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో బీసీ రాజ్యాఽధికార ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. బీసీ వర్గాలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్.. ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ తాను ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీ వర్గాల్లో మహిళా కోటా అమలు చేయకపోవడం వెనుక మతలబేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ వెంటనే తాను ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో ముందు బీసీ వర్గాల మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజికంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల తర్వాత బీసీ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే వర్టికల్ పద్ధతిలో అన్ని విభాగాల్లో మహిళా రిజర్వేషన్లు అమలు జరగాలన్నారు. అలా కాకుండా కేవలం మహిళా రేజర్వేషన్లను మాత్రమే అమలుపరిస్తే అది రిజర్వేషన్ల మౌలిక సూత్రానికి విరుద్ధమన్నారు. సమావేశంలో భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ చేపూరు ఓదెలు యాదవ్, నాయకులు పొదిలి రాజు, సాయిబాబా, దామరకొండ కొమురయ్య, మడత కిశోర్, చింతం అనిల్, వనం మహేందర్, పైండ్ల భిక్షపతి , గాజు యుగంధర్ యాదవ్, కూరపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు
బీసీ రాజ్యాధికార సమితి
అధ్యక్షుడు దాసు సురేష్


