సాధన సదస్సులో వక్తలు
హన్మకొండ: జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదని, ఈసారైనా కల్పించాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణలో సామాజిక న్యాయం – బీసీ ముఖ్యమంత్రి సాధన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయా పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణలో సామాజిక న్యాయం – బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాధికారం ద్వారానే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ దిశగా 2023లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి చేయడానికి తమ రాజకీయ ఎజెండాను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఓబీసీ కోఆర్డి నేటర్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ధనం, కులం రెండింటికీ ప్రాధాన్యత ఉందని, బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమైన మాట వాస్తవమేనన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ పార్టీ మేల్కొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ 53వ పుట్టిన రోజును జరుపుకున్నారు. డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అను అనే పేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందించారు. సదస్సులో ఆయా సంఘాలు, పార్టీల ప్రతినిధులు డాక్టర్ కాళీ ప్రసాద్, తాడూరు శ్రీనివాస్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, నల్ల సూర్య ప్రకాష్, డాక్టర్ తిరినహరి శేషు, డాక్టర్ సంకినేని వెంకట్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, చంద్రకళ, మాస్ సావిత్రి, డాక్టర్ తీగల ప్రేమ్ సుందర్, బైరి రవికృష్ణ గౌడ్, దాసు సురేష్, వీరన్న మెరుగు బాబు యాదవ్, అల్లం నాగరాజు, యాదగిరి గౌడ్, డాక్టర్ జగదీష్ ప్రసాద్, శ్రీనివాస్‌లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


