ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

రాజ్యాంగం, ఈసీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహించాలి చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు తప్పవు మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌

నెహ్రూనగర్‌: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం సమాయత్తం కావాలని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. సాధారణ పురపాలక ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ప్రాంతీయ సమాయత్త సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నందున, ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకుంటే చివరి నిమిషంలో గందరగోళం ఉండదని తెలిపారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ప్రజల విశ్వాసం చూరగొనేలా ఎన్నికలు సజావుగా సాగాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలోనే..

మున్సిపల్‌ పరిపాలన కమిషనర్‌, డైరెక్టర్‌ (సీడీఎంఏ) పి.సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈసారి మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

బ్యాలెట్‌ బాక్సుల ద్వారానే పోలింగ్‌

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రకటన వెలువడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్‌ బాక్సుల ద్వారా పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారులు హ్యాండ్‌బుక్‌పై పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. మీడియా, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులపై ఎప్పటికప్పుడు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని స్పష్టం చేశారు.

24 మున్సిపాలిటీల్లో ముందస్తు ఏర్పాట్లు

మున్సిపల్‌ శాఖ ప్రాంతీయ సంచాలకులు సూర్యదేవర హరికృష్ణ మాట్లాడుతూ గుంటూరు ప్రాంత పరిధిలోని 33 మున్సిపాలిటీలకుగాను ప్రస్తుతం 24 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ముందు, పోలింగ్‌ సమయంలో, అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్‌ శాఖ జేడీ రవీంద్ర బాబు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. సదస్సులో వివిధ జిల్లాల మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement