చేబ్రోలు: భవిష్యత్ వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ సమన్వయంతో మరింత సమర్థమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా యువ పరిశోధకులు పరిశోధనలు చేపట్టాలని ఏపీలోని ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్, ప్రొఫెసర్ పి.విశ్వనాథ్ సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘నేషనల్ సెమినార్ ఆన్ నెక్ట్స్ జెన్ హెల్త్‌కేర్: బయో మెడికల్ ఇమేజింగ్ థ్రూ క్వాంటమ్ డ్రివెన్ డీప్ లెర్నింగ్’ అనే అంశంపై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విశ్వనాథ్ మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు. సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకునే క్లిష్టమైన వైద్య సమస్యలను క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా విశ్లేషించగలదని వివరించారు. వ్యక్తిగత వైద్య సేవలు, ఔషధాల రూపకల్పన, జీనోమిక్ డేటా విశ్లేషణ, క్యాన్సర్ వంటి క్లిష్ట వ్యాధుల నిర్ధారణలో క్వాంటమ్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎన్‌ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ కొడాలి మాట్లాడుతూ భారీ స్థాయిలో డేటా విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ ఇమేజింగ్ వంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ విశేష అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులు ఇప్పటి నుంచే అవగాహన పెంచుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు. రాజస్థాన్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ, వైద్య చిత్రాల విశ్లేషణ, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ, చికిత్సా ప్రణాళికల రూపకల్పన, ఔషధాల అభివృద్ధి వంటి అనేక విభాగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్ సమన్వయంతో ఆరోగ్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు పరిశోధనల ద్వారా ఈ మార్పుకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు.
ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్ విశ్వనాథ్


