కనిపించని జనసైనికులు...
● టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా కరువు
● దూరం పాటించిన జనసైనికులు
● నియోజకవర్గానికి లభించని హామీలు
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సాదాసీదాగా సాగింది. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోయింది. కూటమిలో భాగస్వాములులైన కొద్దిమంది బీజేపీ నాయకులు నామమాత్రంగా హెలిప్యాడ్ వద్దకు సీఎంను కలిసి వెళ్లారు. మరోవైపు జనసైనికులు పూర్తి దూరంగా ఉండిపోయారు. మొత్తంగా శనివారం అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంఽధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటనకు స్పందన అంతంతే కనిపించింది. మధ్యాహ్నం 12.20 ప్రాంతంలో ముఖ్యమంత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో విధానంలో భాగంగా రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టౌలు, పాత్రలను అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడి కేంద్రానికి అందించారు. రాగి జావ కాచే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు.
ప్రకృతి వ్యవసాయక్షేత్ర పరిశీలన...
అనంతరం రైతు గుడిపల్లి నాగభూషణం సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి సాగుతో పెట్టుబడి తగ్గి భూసారం పెరిగి దిగుబడులు అధికంగా వచ్చాయని సీఎంకు రైతు వివరించారు. ఎద్దు గానుగ ద్వారా నూనె తీయడం పరిశీలించి, నూనె కొనుగోలు చేశారు. అక్కడి నుంచి చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి లింగంగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి సాయంత్రం 4.15 గంటలకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పీఎం కిసాన్ యోజన ప్రసంగాన్ని ఎల్‌ఈడీపై వీక్షించే కార్యక్రమం నిర్వహించారు.
తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం
సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభమయ్యాక ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పావుగంట గడిచాక ప్రధాని ప్రసంగం హిందీలో కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్ల నుంచి అసహనం వ్యక్తం అయింది. ప్రసంగం నిలిపివేయాలని అరుపులు, కేకల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారికి నచ్చచెప్పాల్సి వచ్చింది. ప్రధాని ప్రసంగం 5.30 వరకు కొనసాగిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రసంగం మొత్తం పరనింద, ఆత్మస్తుతికే పరిమితమైంది. పేరుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అయినప్పటికీ ఎక్కువగా టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం విశేషం. వివిధ రకాల టెక్నాలజీలను తన పరిపాలన కాలంలో తెచ్చానని, ఇంకా తెస్తున్నానని వల్లెవేశారు.
కూటమిలో భాగస్వాములైన బీజేపీ నాయకులు కొద్ది మంది మాత్రమే హెలిప్యాడ్ వద్దకు వచ్చి ముఖ్యమంత్రిని కలసి వెళ్లారు. మరో భాగస్వామి అయిన జనసేన నాయకులు మాత్రం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరూ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా పురపాలక సంఘం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వంటి వాటిలో జనసేనకు చెందిన వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించకపోవడం, నామినేటెడ్ పదవులు కట్టబెట్టకపోవడమే వారి అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు కేవలం ఇండోర్‌లో ఏర్పాటు చేసిన సీట్లకు మాత్రమే ప్రజలు పరిమితమయ్యారు. అంతకు మించి ఎక్కడా క్యాడర్‌లో ఉత్సాహం కనిపించిన దాఖలాలు కానరాలేదు. తీరా నియోజవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నోట ఎటువంటి హామీలు లభించకపోవడం మరింత నిరాశ కలిగించింది.


