గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. గుంటూరు నగరం కేవీపీ కాలనీలోని సిద్దార్థ స్కూల్, శ్రీనివాసరావుపేటలోని సుజాత స్కూల్‌ను డీఈఓ శనివారం తనిఖీ చేశారు. పాఠశాల గుర్తింపు ధ్రువపత్రం, రికార్డులను పరిశీలించారు. నిబంధనలు పాటించడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను వసూలు చేయాలని ఆయా పాఠశాలల యాజామాన్యాలకు సూచించారు. క్యాంపస్‌లలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయించరాదని స్పష్టం చేశారు.
నగరంపాలెం: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ (యూజీ)–2026 పునఃపరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాలలో 7,312 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్న దృష్ట్యా ప్రతి కేంద్రం వద్ద పోలీస్ అధికార, సిబ్బందిని నియమించామని అన్నారు. పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసేయాలని దుకాణదారులకు సూచించారు. మొబైల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదని అన్నారు. పరీక్ష నిబంధనలు ఉల్లంఘించినా, అనుమానాస్పదంగా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగితే డయల్–112 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్లల్లో సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.


