గుంటూరు మెడికల్: జాతీయస్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల డెర్మటాలజీ పీజీ వైద్య విద్యార్థి సత్తా చాటారు. వారం క్రితం ఆన్‌లైన్‌లో నిర్వహించిన జాతీయ క్విజ్ పోటీల్లో డెర్మటాలజీ ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థి డాక్టర్ బండారు రాకేష్ ప్రతిభ చాటి మూడో బహుమతి సాధించారు. మొదటి బహుమతిని గుజరాత్, రెండవ బహుమతిని ఒడిశాకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు గెలుపొందారు. దేశ వ్యాప్తంగా పీజీ వైద్యులకు స్కిన్ బ్యారియర్స్ అనే అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన డాక్టర్ రాకేష్‌ను శనివారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరచారి , గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్‌లు అభినందించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ డీఎస్‌ఎస్ శ్రీనివాసప్రసాద్, ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు.


