గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఆటిజంతో బాధపడుతున్న చిన్నారికి సదరం సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి వెల్లడించారు. శుక్రవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆటిజం సమస్యకు 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే శాశ్వత సర్టిఫికెట్ ఇవ్వడం కుదురుతుందని వివరించారు. గుంటూరుకు చెందిన గోపి తన ఐదేళ్ల కుమారుడికి ఆటిజం సర్టిఫికెట్ ఇచ్చేందుకు వైద్యులపై ఒత్తిడి చేశాడని, రూ.50 వేలు లంచం అడిగినట్లు తప్పుడు ఆరోపణలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లవాడికి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని, పీజీ వైద్యులకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వనందువల్లే గోపి జీజీహెచ్ వైద్యులపై బురద జల్లేందుకు లంచం ఆరోపణలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జీజీహెచ్ వైద్యుల మనోధైర్యం దెబ్బతినేలా, ఆస్పత్రి పరిస్థితిని భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేసిన గోపిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ నీలి ఉమాజ్యోతి మాట్లాడుతూ రాత్రిబవళ్లు కష్టపడి రోగులకు సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఆరోపణలు వచ్చినప్పుడు వారి వద్ద వివరాలు సేకరించిన తరువాత వార్తలు ప్రచురించాలని కోరారు. వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతిసేలా వార్తలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు.


