సమస్యలపై కలెక్టర్‌కు ఉద్యోగుల ఏకరువు | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై కలెక్టర్‌కు ఉద్యోగుల ఏకరువు

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

సమస్యలపై కలెక్టర్‌కు ఉద్యోగుల ఏకరువు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌ ఎదుట ఏకరువు పెట్టారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారం కోసం విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ అధ్యక్షతన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, ఎన్జీవోలకు చెందిన 14 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. హెల్త్‌కార్డులపై వైద్యం అందని తీరును వివరించారు. నగదు రహిత వైద్యం అందించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడాలని కోరారు. కారుణ్య నియామకాలపై తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ అమలు పర్చాలని పెన్షనర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌ మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని విభజించి, తూర్పు నియోజకవర్గంలో కొత్తగా ఎంఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. నలుగురు ఎంఈవోలు ఒకే కార్యాలయంలో విధులు నిర్వర్తించడం వలన ఘర్షణ వాతావరణం నెలకొంటోందని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

మున్సిపల్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయలను విద్యాశాఖలో విలీనం చేయడంతో జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన పీఎఫ్‌ సొమ్మును చెల్లించారని, నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పీఎఫ్‌ డబ్బులు చెల్లించలేదని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌తో పాటు యూటీఎఫ్‌, పీఆర్‌టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల సుబ్బారావు, కె.నరసింహారావు కలెక్టర్‌కు సమస్యలపై వినత్రి పత్రం అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement