తెనాలిరూరల్: తెనాలి గంగానమ్మపేట శివాలయం వెనుక గేటు రోడ్డులోని శ్రీ విజయలక్ష్మి జ్యుయలర్స్‌లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక జోరున కురుస్తున్న వర్షంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రాడ్లతో తాళాలను ధ్వంసం చేశారు. లోనికి వెళ్లిన వారికి, బంగారు ఆభరణాలున్న మరో గది తాళం తీయడం చేతకాలేదు. ముందు గదిలో ఉన్న 50 గ్రాముల వెండి వస్తువులతో ఉడాయించారు. షాపు తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని యజమానులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
నేడు ఎస్సీ నిరుద్యోగ యువతకు జాబ్ మేళా
నెహ్రూనగర్: జిల్లా పెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం, గుంటూరు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, గుంటూరు జిల్లా వారి సహకారంతో ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఈడీ దుర్గాబాయి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం కింద ఈ కార్యక్రమం శుక్రవారం 9.30 గంటలకు, ఫిరంగిపురం మండలం, మెయిన్ రోడ్, వేలంకని మాత చర్చి ఎదురు, గ్లోబల్ ఫౌండేషన్‌న్‌లో అవగాహన కార్యక్రమంతోపాటు జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు 10 కంపెనీలు పాల్గొని 315 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని చెప్పారు. మరిన్ని వివరాలకు 89195 08017 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెదకాకాని: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గుంటూరు ఆటోనగర్‌లో చో టు చేసుకుంది. అగతవరప్పాడు ఏవీఎన్ కాలనీకి చెందిన షేక్ మీరావలి(26) కొంతకాలంగా గుంటూరు ఆటోనగర్‌లో లారీలకు బాడీ అమర్చే పనులకు వెళుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఆటోనగర్‌లోని వర్క్‌షాప్‌కు వెళ్లి లారీకి బాడీ అమర్చే పనులు చేస్తుండగా కరెంట్ తీగ తగిలి షాక్‌కు గురయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మీరావలి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ తెలిపారు.


