ఫిరంగిపురం: ప్రమాదవశాత్తు స్కూటీని, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలకేంద్రంలోని చెక్‌పోస్టు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గరుడాచల పాలెంకు చెందిన శ్రీకాంత్(40) పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. శాంతిపేటలో బంధువుల ఇంటికి వచ్చి తరువాత వేములూరిపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ముందు వెలుతున్న స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా పక్కకు మరలడంతో దానిని శ్రీకాంత్ ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి చికిత్సకోసం తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే శ్రీకాంత్ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య కిరణ్మయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుకి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో సత్తా
చినగంజాం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ గ్రాండ్ మాస్టర్లతో పోటీ పడి మూడో స్థానం సాధించాడు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పర్వతరెడ్డి అజయ్ సంతోష్. ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జూన్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన 360 వన్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో గ్రాండ్ మాస్టర్లతో పోటీలో పాల్గొన్న అజయ్ సంతోష్ 9కి 6 పాయింట్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచాడు. అజయ్ సంతోష్ ఈ పాటికే 2500 ఫిడే రేటింగ్‌ను దాటి తన మొదటి జీఎం నార్మ్‌ను సాధించాడు. గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను సాధించడానికి అతడు ఇంకా కేవలం 2 నార్మ్‌లు మాత్రమే సాధించాల్సి ఉంది. అజయ్ వచ్చే వారం మరో జీఎం టోర్నమెంట్ కోసం చైన్నె వెళ్ళనున్నాడు. అటు తరువాత మరిన్ని నార్‌మ్స్ సాధించేందుకు యూరప్‌లోని చెక్ రిపబ్లిక్, పారిస్.. ఫ్రాన్స్ దేశాలకు ప్రయాణం కానున్నట్లు అజయ్ తాతయ్య పర్వతరెడ్డి కాంతారావు తెలిపారు. అజయ్ ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.


