జిల్లాలో భర్తీకాని మూడు డీఎస్పీ పోస్టులు నాలుగు నెలలుగా ఇన్‌చార్జులే దిక్కు పోలీస్ సబ్ డివిజన్ల పనితీరుపై తీవ్ర ప్రభావం
తీవ్ర
ప్రభావం
నగరంపాలెం: జిల్లా పోలీస్ శాఖలో డీఎస్పీల కొరత ఏర్పడింది. నెలలు గడిచినా ఇదే పరిస్థితి. దీంతో ఇన్‌చార్జ్‌లతో పోలీస్ సబ్ డివిజన్లను నెట్టుకొస్తున్నారు. రాజధాని ప్రాంతమని ప్రగల్భాలు పలికే కూటమి ప్రభుత్వంలో గుంటూరులో డీఎస్పీలను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆమడ దూరంలో రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. డీఎస్పీల నియామకాలు చేపట్టకపోవడంతో ఆయా పోలీస్ సబ్ డివిజన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మూడు కీలక పోస్టులూ ఖాళీ..
జిల్లాలో గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు దక్షిణ, నార్త్, తెనాలి, తుళ్ళూరు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో తెనాలి, నార్త్, తుళ్లూరు సబ్ డివిజన్ల మినహా గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు దక్షిణ సబ్ డివిజన్ల డీఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జనవరిలో గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీగా కె.అరవింద్, గుంటూరు దక్షిణ డీఎస్పీగా భానోదయ బాధ్యతలు స్వీకరించారు. సుమారు 13 నెలలు విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న కె.అరవింద్, భానోదయను రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే 2018 గ్రూప్–1లో సెలక్ట్‌డ్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఇద్దరు డీఎస్పీలు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోజుల వ్యవధిలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ ఇన్‌చార్జ్‌గా ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు, గుంటూరు దక్షిణ డీఎస్పీ ఇన్‌చార్జ్‌గా గుంటూరు సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావుకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఎస్పీలు నియమించక సుమారు నాలుగు నెలలైంది. వారం క్రితం గుంటూరు తూర్పు డీఎస్పీ పోస్ట్ సైతం ఖాళీ ఏర్పడింది. డీఎస్పీ అబ్దుల్ అజీజ్ బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీగా బదిలీ అయ్యారు. దీంతో గుంటూరు నగరానికి కీలకమైన మూడు సబ్ డివిజన్లకు డీఎస్పీలు నియమించకపోవడం కూటమి ప్రభుత్వం పనితీరుకి అద్దం పడుతోంది.
ఎందుకీ జాప్యమో...
గతేడాది సెప్టెంబర్‌లో డీఎస్పీలుగా బెల్లం శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు పదోన్నతి పొందారు. వీరిలో బెల్లం శ్రీనివాసరావును వెంటనే గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీగా నియమించారు. ఇటీవల గుంటూరు ఎస్‌బీ –1 సీఐ అలహరి శ్రీనివాస్ డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందగా, జిల్లా ఎస్‌బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందిన కొందరికి ఇప్పటికీ ఏ జిల్లాలోనూ నియమించలేదు. ఆఖరికి ఇటీవల డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందిన అనేక మంది పోస్టింగ్‌లు కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు రాష్ట్ర డీజీపీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇటీవల ఓ డీఎస్పీకి మంత్రి నుంచి పిలుపు రావడం.. బదిలీ అయి బాధ్యతలు స్వీకరించడం వెంటనే జరిగాయి. పలుకుబడి, పరపతి ఉన్న డీఎస్పీలకే కీలకమైన పోస్టులకు బదిలీ చేస్తున్నారనే వాదన లేకపోలేదు.
డీఎస్పీల నియామకాలు జరగకపోవడంతో సబ్ డివిజన్లలో ప్రధాన సమస్యగా మారింది. ఒక్కొక్క సబ్ డివిజనల్ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. డీఎస్పీలను నియమించకపోవడంతో పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా భారీ మోసం, నేరం జరిగితే దిశా నిర్దేశం చేసే డీఎస్పీలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. డీఎస్పీలు ఉంటే సీనియారిటీ ఆధారంగా నేరస్థులను పట్టుకునేందుకు, ఏవైనా కొట్లాటలు ఇతరత్రా నేరాల నియంత్రణకు ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్‌చార్జ్ డీఎస్పీలు నియామకంతో వారి సబ్ డివిజన్లను పర్యవేక్షించడమే సరిపోతుంది. శంకర్‌విలాస్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల దృష్ట్యా గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది, రాజధాని ప్రాంతంలోనూ అదే పరిస్థితి. ఇక వాహనాల క్రమబద్ధీకరణ, ముఖ్య అధికారులు, పాలకుల రాకపోకల వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇక జిల్లాలో నేరాలు కట్టడి చేసేందుకు, చోరులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో సబ్ డివిజన్లకు ఇన్‌చార్జ్‌లను నెలల తరబడిగా నియమించడంతో విధుల భారం ఎక్కువైంది. గుంటూరు నగరంలో కీలకమైన మూడు డీఎస్పీల పోస్టులు ఖాళీ ఏర్పడటంపై పలువురు డీఎస్పీలు వారి ప్రయత్నాలలో వారు నిమగ్నమయ్యారు. కూటమి నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.


