కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి మనోహర్‌లు అడ్డుకోవాలి లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తాం వైఎస్సార్ సీపీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం అమరావతి చుట్టూ ఏర్పాటుచేయనున్న ఔటర్ రింగ్‌రోడ్డుకు తెనాలి ప్రాంతాన్ని అనుసంధానించే లింకు రోడ్డును రద్దు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. లోక్‌సభ స్థానాన్ని కోల్పోయి జిల్లా హోదాకు నోచుకోని తెనాలి, ఇప్పుడు ఓఆర్‌ఆర్‌కు లింకురోడ్డును కోల్పోతే వెనుకబాటుకు గురవుతుందని, ఈ ప్రాంతవాసులకు తీరని అన్యాయం జరిగినట్టు కాగలదని హెచ్చరించారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలి ప్రాంతానికి మేలు చేకూర్చేందుకే గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు తెనాలి–విజయవాడ రోడ్డును నాలుగులైన్ల రహదారిగా మార్చాలని ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు. అయితే పశ్చిమ బైపాస్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాల్లో ఉన్నందున, తన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం, కొన్ని మార్పులతో ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనను ఓఆర్‌ఆర్ డీపీఆర్‌లో చేర్చిందని చెప్పారు.
సీఐ అక్రమ సంబంధాలపై విచారించాలి...
నెలవారీ మామూళ్లు కాకుండా అప్పుల పేరుతోనూ కలెక్షన్లు చేస్తున్న తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్‌ను వీఆర్‌కు పంపుతూ తక్షణం నిర్ణయం తీసుకున్న జిల్లా ఎస్పీ వకుళ్‌జిందాల్‌కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. ఇది కేవలం ఒక వ్యాపారి సమస్య మాత్రమే కాదనీ, పట్టణంలోని పలువురు వ్యాపారులకు ఇదే సమస్యగా ఉందన్నారు. వీఆర్‌కు పంపిన సీఐపై మహిళలను లొంగదీసుకుని, అక్రమ సంబంధాలు నడుపుతున్న ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపైనా విచారించాలని ఎస్పీని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో తెనాలిలో పోలీసుల కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. మారీసుపేటలోని ఇల్లు అద్దెకు తీసుకుని ఖాళీచేయటం లేదని ఓ వృద్ధమహిళ మీవరకు వచ్చి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఎస్పీ నుద్దేశించి అన్నారు. పైగా ఆమైపెనే దౌర్జన్యం చేశారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్, కఠారి హరీష్, కాలిశెట్టి ఫణికుమార్, కాకి దేవసహాయం, రావి శ్రీనివాసరావు, షేక్ దుబాయ్‌బాబు, కొర్ర యశోద, మైలా విజయ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


