వడ్లమూడిలో చెరువులో అభివృద్ధి పేరిట మట్టి దోపిడీ! పొక్లెయిన్లతో లోతుగా తవ్వకాలు ట్రాక్టర్లతో యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్న టీడీపీ నేతలు పట్టించుకోని అధికారులు విస్తుపోతున్న ప్రజలు
గ్రామంలో ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో మట్టి దోపిడీ జరుగుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. సొంత పొలంలో మట్టి తవ్వకాలు చేసుకుంటూ మెరక చదును చేసుకుంటేనే అనుమతులు లేవని కేసులు నమోదు చేసి సీజ్ చేసే రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన వారు కావటంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీ అధికారులు పత్తా లేరు. అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా, సంబంధిత అధికారులు స్పందించికపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకం దారులకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, మట్టి దందాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వడ్లమూడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
చేబ్రోలు: చెరువుల అభివృద్ధి పేరిట అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మట్టి దందాకు తెరలేపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ గ్రామంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువును ప్రధానమంత్రి కృషి సంచార యోజన (పీఎంకేఎస్‌వై) కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేసింది. అయితే, ఈ నిధులను సద్వినియోగం చేసి చెరువును బాగు చేయాల్సింది పోయి, కొందరు అధికార పార్టీ నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని కాసులు కురిపించే వ్యాపారంగా మార్చుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా తవ్వకాలు
పీఎంకేఎస్‌వై పథకం కింద చేపట్టిన చెరువు అభివృద్ధి పనుల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. నాలుగు పెద్ద పెద్ద పొక్లెయిన్లు, హిటాచీ వంటి భారీ యంత్రాలను రంగంలోకి దించి రాత్రీ పగలు తేడా లేకుండా చెరువును యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. వడ్లమూడి పెద్ద చెరువును ఇష్టానుసారంగా తవ్వేస్తూ కొల్లగొడుతున్నారు. చెరువును తవ్వగా వచ్చిన నాణ్యమైన మట్టిని అధికార పార్టీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి ట్రాక్టర్ రూ.1200ల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి సీనరేజీ రూ.700లు, ట్రాక్టర్ బాడుగ రూ.500ల చొప్పున మొత్తం రూ.1200లుగా నిర్ణయించి ప్లాట్‌లకు, మెరకల కోసం వందలాది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఒకపక్క ప్రభుత్వ నిధులు రూ.50 లక్షలు, మరోపక్క మట్టిని అమ్ముకుంటూ రెండు చేతులా లాభాలు గడిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


