నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57 డివిజన్లను 76కు పెంచుతూ పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో మొదటిసారిగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పునర్విభజన హద్దుల మ్యాపు అనధికారికంగా బయటకు వచ్చింది. అది మొత్తం అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉందంటూ పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 25వ తేదీన మరొక షెడ్యూల్‌తో మే 17వ తేదీన డివిజన్ల పునర్విభజన ముసాయిదా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మే 18వ తేదీన ముసాయిదా ప్రకటిస్తామని అధికారులు చెప్పడంపై పలు రాజకీయ పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజనకు సంబంధించిన మ్యాపులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్లినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చే విధంగా చక్రం తిప్పినట్లు నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే 17వ తేదీన ప్రచురించాల్సిన ముసాయిదాను 18న ప్రకటిస్తామని అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం ప్రకటించే ముసాయిదా కేవలం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంలోనే ఈ నెల 24వ తేదీలోగా అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పడంపై వివిధ పార్టీల శ్రేణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు సోమవారం ప్రకటించే ముసాయిదాను అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడంతోపాటు, పత్రికలు, ఇతర మీడియాల ముఖంగా వెల్లడి చేసి తద్వారా అభ్యంతరాలు సేకరించాలని వివిధ పార్టీ శ్రేణులు, నగరవాసులు కోరుతున్నారు.


