కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
గుంటూరు వెస్ట్: గ్రామాల వారీ పంట ప్రణాళిక అవసరమని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మ, శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్, వ్యవసాయ శాస్త్రవేత్త డా. పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు తట్టుకుని నిలబడే వ్యవసాయ విధానాలు అవసరం అన్నారు. డ్రోన్ల వినియోగం వలన పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
బ్యాటరీ ట్రై సైకిళ్ల అందజేత
శరీరానికి పరిమితులు ఉంటాయేమో గాని, సంకల్పానికి ఉండవని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన పలువురు విభిన్న ప్రతిభావంతులకు రూ. కోటికి పైగా విలువైన సీఎస్‌ఆర్ నిధుల ద్వారా బ్యాటరీ ట్రై సైకిళ్లను, వీల్ చైర్లను, 512 ఉపకరణాలు, పరికరాలను శనివారం స్థానిక టీజేపీఎస్ కళాశాలలో ఆయన అందజేశారు.


