గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కారాగారంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డెస్క్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ వల్ల ఖైదీలకు, వారి బంధువులకు ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. ఖైదీలు, వారి బంధువులు హెల్ప్ డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్, స్టాఫ్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ డెఫన్స్ కౌన్సెల్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు మహిళా ప్రాంగణంలోని శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న పిల్లలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపురంలోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు సురక్షితమైన బాల్యం, భవిష్యత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ జీవన్ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించేలా కృత్రిమ మేధపై ఆవిష్కరణలు ఉండాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతుల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిరంగా మార్చే లక్ష్యంతో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యాన నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంనందున్న సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయంలో కృతిమ మేధస్సుపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు పయనిస్తుందని చెప్పారు. ఈ డేటా కచ్చితత్వం రైతు సేవ కేంద్రాలలో లభ్యమయ్యేలా చూడాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ రవినారాయణసాహూ, సీఆర్‌ఐడీఏ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీఎం సుబ్బారావు వ్యవసాయ, అనువర్తనాలు విభాగంలో గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వీఎం చౌదరి, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర మాచవరం మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సెక్రటరీగా డాక్టర్ మణి వ్యవహరించారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.త్రిపాఠి, హైదరాబాద్ అటారీ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎన్ మీరా, డాక్టర్ ఎంవీ రమణ, యూనివర్సిటీ అధికారులు, వివిధ పరిశోధన సంస్థలు, స్టార్టప్ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): పరిశ్రమల రక్షణలో శిక్షణ పొందిన సేఫ్టీ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ (4 సంవత్సరాలు), 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్‌న్‌ను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పి. బ్రహ్మాజీరావు, హెడ్ ఆప్ ది ఫైర్ అండ్ సేప్టీ విభాగం అరుణ్‌కుమార్ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.


