తెనాలిరూరల్: తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పశు పాల, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు జాతి సంపదని, వాటిని కాపాడుకోవాలన్నారు. రైతాంగానికి పెద్ద పీట వేసి రైతులు సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలు జాతిని ప్రేమిస్తూ కాపాడుతున్న రైతాంగానికి ధన్యవాదాలు తెలిపారు. తొలి రోజు రెండు పళ్ల లోపు విభాగం పోటీలు నిర్వహించారు. ఈ విభాగంలో మొత్తం 20 జతల ఎడ్లు వచ్చాయని, అవసరమైతే సోమవారం కొనసాగిస్తామని రిఫరీగా వ్యవహరిస్తున్న సూరపనేని రాధాకృష్ణ ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఇతర నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.


