తెనాలి: ఆ గానం సంగీత మధురిమలను పంచింది...ఆధ్యాత్మిక కీర్తనలు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సంగీతాభిమానులకు పారవశ్వాన్ని కలిగించాయి. దాదాపు గంటన్నరసేపు సాగిన ఆ గానాలాపనకు శ్రోతలు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని చాటారు. ఎన్నో ఏళ్లుగా తన సంగీత విద్యతో శ్రోతలను రంజింపజేస్తూ, మరెందరికో శిక్షణనిస్తున్న చింతలపాటి మంజుల గానాలాపన ప్రతి ఎదనూ కదిపింది. ప్రతి కీర్తనకూ శ్రోతలనుండి కర తాళధ్వనులు అందుకున్నారు. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్‌చౌక్‌లో గల శ్రీసీతారామమందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు ఇందుకు వేదికగా నిలిచాయి. సంగీతవ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా సొంతూరు తెనాలిలో వసంత నవరాత్ర ఉత్సవాల్లో సంగీత కచేరీ చేయటం అదృష్టంగా భావించానని డాక్టర్ మంజుల చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెనాలి డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత, కళాభిమాని మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ డాక్టర్ మంజులను సత్కరించి అభినందించారు. సంగీతరంగంలో తెనాలికి గల ఘనవారసత్వాన్ని కొనసాగిస్తున్న విద్వన్మణిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామమందిరం పాలకవర్గ కమిటి కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి డాక్టర్ మంజులను ప్రశంసించారు.
సంగీత విద్వన్మణి డాక్టర్ చింతలపాటి మంజులకు సత్కారం


