మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్‌

Mar 23 2026 8:45 AM | Updated on Mar 23 2026 8:45 AM

మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్‌ ● రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం ● సీసీఎస్‌ డీఎస్పీ మధుసూదనరావు వివరాలు వెల్లడి చోరీ కేసులో ఇద్దరు మైనర్ల అరెస్ట్‌ బకింగ్‌హామ్‌ కెనాల్‌లో దూకి వృద్ధుడి ఆత్మహత్య పిడుగుపాటుతో యువకుడు మృతి

● రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం ● సీసీఎస్‌ డీఎస్పీ మధుసూదనరావు వివరాలు వెల్లడి

గుంటూరు రూరల్‌: ట్రూకాలర్‌లో మహిళల పేర్లను చూసి ఆయా సెల్‌ నంబర్లకు వీడియో కాల్స్‌ చేసి అసభ్యకర వీడియోలు పంపుతున్న వ్యక్తిని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ డీఎస్పీ మధుసూదనరావు, సీఐ వంశీధర్‌ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన రామనాథం నాగేశ్వరరావు గతంలో పెట్రోల్‌ బంకులో పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి ఆడవారిని బెదిరించి డబ్బులు గుంజాలని తన ఫోన్‌లో రియల్‌ నంబర్స్‌ అప్లికేషన్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నాడు. ఆ నంబర్లను ట్రూ కాలర్‌లో చెక్‌ చేసి వాటిలో ఆడవారి పేర్లతో రిజిస్టర్‌ అయిన నెంబర్లకు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌లు పెట్టడం, వారికి వీడియో కాల్స్‌ చేయడం అసభ్య కరమైన ఫొటోలను వీడియోలను పంపుతున్నాడు. తద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తుండేవాడు. పలకలూరు రోడ్డులోని ఒక మహిళకు అదే విధంగా అసభ్య పదజాలంతో వాట్సప్‌ ద్వారా బూతులు తిట్టి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆదివారం పలకలూరు రోడ్డు విజ్ఞాన్‌ కాలేజి దగ్గరలో నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి వివో ఫోన్‌, ఆపిల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆదేశాల మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, మహిళా భద్రతా దష్ట్యా శక్తి టీములు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారు 112కు ఫోన్‌ చేసి పోలీస్‌ వారి సహాయం పొందవచ్చని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ మీడియా మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కేసులో ప్రతిభ కనబరిచిన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ వంశీధర్‌, ఎస్‌ఐ మహేష్‌కుమార్‌, సిబ్బందికి రివార్డు అందజేసి అభినందించారు.

– రూ.11.80 లక్షల సొత్తు స్వాధీనం

తెనాలిరూరల్‌: తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ సోనోవిజన్‌లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.11.80 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే జువైనెల్‌ హోమ్‌లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటుపడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ సోనోవిజన్‌లో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి అనంతరం జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.11.80 లక్షల విలువైన సెల్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాలేనికి చెందిన 17 ఏళ్ల బాలుడు, చినరావూరు ఆర్టీసీ ఓల్డ్‌ డిపోరోడ్డుకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి రెండో అంతస్తులో గల గ్లాస్‌ డోరు పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్‌, వాచీలు, బడ్స్‌, చార్జర్‌, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూమ్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీచౌక్‌లో నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్‌ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్‌ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకుగాను అతడిపైన స్థానిక వన్‌న్‌ టౌన్‌, త్రీటౌన్‌, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లలో కేసులున్నాయి. వీటిలో రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా, తొమ్మిది నెలలపాటు విజయవాడ హోమ్‌లో ఉండి నాలుగు నెలల కిందట విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్‌ సెకండియర్‌ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడిన చినరావూరు బాలుడిని కలుపుకుని సోనోవిజనన్‌ షోరూమ్‌లో చోరీ చేసినట్టు వివరించారు. షోరూమ్‌ ఉన్న కాంప్లెక్సులోనే ఉన్న హోటల్‌లో క్లీనర్‌గా చేసిన 17 ఏళ్ల బాలుడు, రెక్కీ నిర్వహించి 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీ పాల్పడినట్టు తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ రాములునాయక్‌, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్‌హామ్‌ కెనాల్‌ ఉండవల్లి సెంటర్‌ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సాయికుమార్‌ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్‌ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు(68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన ఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్‌ఐ తెలిపారు.

అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్‌ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన తోపాటు పిడుగు పడటంతో విజయ్‌కుమార్‌(25) అక్కడిక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్‌ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్‌ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అమరావతి సీహెచ్‌సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement