తాడికొండ: కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక పెదపరిమి మొవ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామ్ లోక్–యువ కవుల కోసం కవిత్వ మెళకువల’పై ఒక రోజు వర్క్‌షాప్‌ను ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆవేదన, సున్నితం, వ్యంగ్యం, చైతన్యం రగిల్చే విధంగా రాస్తూ యువకవులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. పెద్దగా చదువు లేని గుర్రం జాషువా, భరద్వాజలు తమ రచనల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారని గుర్తు చేశారు. సభాధ్యక్షులు ఎంవీఆర్‌ఎం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో వృద్ధాలయాల నిర్వహణతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో కూడిన పోటీ పరీక్షల శిక్షణ ఇస్తూ 700 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వర్క్‌షాప్‌నకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. అనంతరం ‘కవిత్వంలో గ్రామీణ జీవనం’ అంశంపై డాక్టర్ సుంకర గోపాల్, మందరపు హైమావతి, కోసూరి రవికుమార్‌లు విశ్లేషించారు. వర్క్‌షాప్‌నకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి 50 మందికి పైగా గ్రామీణ యువకవులు, రచయితలు, రచయిత్రులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ట్రస్టు అధ్యక్షులు మొవ్వ సాంబిరెడ్డి, కార్యదర్శి మున్నంగి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ శారద తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ శివశంకర్


