శనగ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

శనగ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

Mar 23 2026 8:45 AM | Updated on Mar 23 2026 8:45 AM

శనగ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

లక్ష్మీపురం(గుంటూరువెస్ట్‌): శనగ పంటను ప్రభుత్వమే మార్కెఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన ఆదివారం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటా రూ.5,875లకు కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం తగిన విధంగా కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు 5 వేల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం శనగల దిగుమతిని రద్దు చేయాలని, దేశీయ శనగలను కొనుగోలు చేయాలని కోరారు. శనగలతోపాటు మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుము వంటి పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న సామ్రాజ్యవాద దాడిని ఖండించాలని ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని, ట్రంప్‌ యుద్దోన్మాద చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్‌ మహ్మమారికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా విస్తత ప్రచారం చేపట్టాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాలలో అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం 6వేల ఎకరాల సారవంతమైన భూములను సేకరిస్తున్నారని, భూములు కోల్పోయే రైతులకు ప్రైవేటు మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌.అరుణ, ఎమ్‌.ఎ.చిష్టీ, డి.లక్ష్మీనారాయణ, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement