● కష్టపడితేనే జీవితంలో సక్సెస్ ● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్
గుంటూరు ఎడ్యుకేషన్: కష్టపడితేనే జీవితంలో విజయాన్ని సాధించగలమని, ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు షార్ట్‌కట్స్ లేవనే విషయాన్ని తెలుసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని చాణక్య ఎడ్యుకేషనల్ హబ్‌లో ‘సందేహాలతో సతమతమవుతున్న దశ నుంచి ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే స్థాయికి చేరుకోవడం ఎలా’ అనే అంశంపై విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస అభివృద్ధి వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశలో పట్టుదలతో చదవాలని, ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఒక లక్ష్యం అనేది ఉండాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, నైతిక, మానవతా విలువలను ఆచరించినప్పుడే జీవితంలో సన్మార్గంలో పయనించగలరని అన్నారు. చదువుల పేరుతో ఒత్తిడి, ఆందోళనతో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని, శ్రమను నమ్ముకుని, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని, విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు చేసుకోవాలన్నారు. ప్రేరణాత్మక వక్త కె.శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, వ్యాపార సంబంధమైన విషయాల్లో దృష్టి సారించాలని సూచించారు. చాణక్య ఎడ్యుకేషనల్ హబ్ సీఈఓ డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ జీవితంలో ఏ విధంగా ఎదగాలి, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దానిని చేరుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జీవితంలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సూచనలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.


