కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 20.2 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 2 మి.మీ. వర్షం కురిసింది. సగటున 5.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ మండలంలో 17.4 మి.మీ, పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 11.2, తుళ్లూరు 8, మంగళగిరి 7.8, దుగ్గిరాల 3.4, మేడికొండూరు 3.4, తాడేపల్లి 3.2, చేబ్రోలు 3, వట్టిచెరుకూరు 3, తెనాలి 2.6, కొల్లిపర మండలంలో 2.5 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మార్చి 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 7 మి.మీ. కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్‌ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు.
డాక్టర్ కొంగర శ్రీకాంత్
గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలితో నేడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని డాక్టర్ కొంగర శ్రీకాంత్ అన్నారు. ఆధునిక చికిత్సలతో జీవనశైలిలో మార్పులతో ఊబకాయాన్ని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతిరోడ్‌లోని బండ్లమూడిగార్డెన్స్‌లో ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధిక బరువుతో అనేక వ్యాధులు వస్తున్నాయని, బరువు తగ్గించుకోవటం కోసం చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్‌ను ప్రదర్శనలో ఉంచామని, అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యకమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు నర్మదా, నీరజ, స్వప్న్కి, ఋషి కృష్ణ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.
నగరం: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిపై కళ్లెదుటే లారీ ఎక్కడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం మండలంలోని శివంగులపాలెం జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ బండ్ల భార్గవ్ కథనం.. మండలంలోని మంత్రిపాలెం శివారు బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రాజేశ్వరావు, సుజిని దంపతులు. వారు తమ కుమారుడు దినేష్(13), కుమార్తెతో కలసి ద్విచక్ర వాహనంపై భట్టిప్రోలు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్ తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె కూడా గాయాలపాలైంది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహానికి పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భార్గవ్ తెలిపారు.
వరస ప్రమాదాలతో భయాందోళన
గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పీటా గోపాలం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో అంబులెన్స్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదివారం అదే ప్రాంతంలో లారీ ఢీకొని బాలుడు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు .వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పెట్టించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


