పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం గురువారం కనుల పండువగా ప్రారంభమైంది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున ప్రత్యేక ప్రార్థనలతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు షఫా బావి నీటితో స్నానాలు చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 7 గంటలకు బాజీబాబా గుఱర్రం దర్గాలో ప్రదక్షిణలు చేసింది. దర్గా ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందిని అలంకరణలో గంధం బిందెలతో ప్రారంభమైన బాజీబాబా వారి గుర్రంతో శుక్రవారం ఉదయం వరకూ వెనిగండ్ల గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ మహోత్సవం బాణసంచా వెలుగులు, తీన్‌మార్ తప్పెట్లు, సన్నాయి వాయిద్యాలు, బాండ్‌మేళాలు, విద్యుత్ కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. దర్గాకు చేరుకున్న భక్తులు బాబా వారి గుర్రం వెంట నడిచారు. ఊరేగింపు ముగించుకుని బాబావారి గుర్రం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు దర్గాకు చేరుకుంటుందని అనంతరం భక్తులకు గంధం పంచిపెట్టడం, సలామి ప్రార్ధనలతో ఉరుసు మహోత్సవం ముగుస్తుందని ఈఓ షేక్ ఖాజావలి తెలియజేశారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు


