జిల్లా అదనపు ఎస్పీ సంతోష్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా అదనపు ఎస్పీ సంతోష్‌

Mar 27 2026 9:13 AM | Updated on Mar 27 2026 9:13 AM

బెట్టింగ్‌ యాప్‌లపై ప్రత్యేక దృష్టి వాణిజ్య ప్రాంతాల్లో 15 గృహ సిలిండర్లు సీజ్‌

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

నరసరావుపేట రూరల్‌: పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం ఫిబ్రవరి నెల నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సంతోష్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నేరాలు, మహిళలపై నేరాలు, శారీరక దాడులకు సంబంధించిన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్లను తక్షణమే అమలు చేయాలని తెలిపారు. తప్పిపోయిన వారి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి కుటుంబాలకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, ఆస్తి సంబంధిత నేరాల కేసుల్లో దర్యాప్తును ప్రాధాన్యంగా తీసుకుని, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తిచేసి చార్జ్‌షీట్‌లు దాఖలు చేయాలని ఆదేశించారు. మోసం, అధికార దుర్వినియోగం వంటి వైట్‌ కాలర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగి ఉండేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెట్టింగ్‌లతో ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఎటువంటి లాభం ఉండదని చెప్పారు. అంతేగాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని పేర్కొన్నారు. బెట్టింగ్‌లతో సమయం వృధా చేసుకోవద్దని, యువత ఉన్నత స్థాయికి చేరేందుకు తమ సమయం ఉపయోగించాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే డయల్‌ 112 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్లల్లో సమాచారం అందించాలని అన్నారు. ఈనెల 28 నుంచి ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం దృష్ట్యా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బులు పోగొట్టుకుని మానసిక ఒత్తిడికి గురై, నిరాశ, ఆత్మన్యూనత భావాలతో చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారితీస్తాయని పేర్కొన్నారు.

కొనసాగుతున్న విజిలెన్స్‌ తనిఖీలు

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : ఉమ్మడి జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, దుకాణాలపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్‌న్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగపు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు, చేబ్రోలు, పొన్నూరు పట్టణంలో చేపట్టారు. గుంటూరు రూరల్‌ మండలం నల్లపాడు హోసన్న మందిరం ఎదురు బెంగళూరు అయ్యం గారి బేకరిలో మూడు గృహ ఎల్‌పీజీ సిలిండర్లు, చేబ్రోలు మండలం మంచాల గ్రామం శ్రేష్టా కేఫ్‌ ఫుడ్‌ కోర్ట్‌లో నాలుగు సిలిండర్లు, పొన్నూరు టౌన్‌ ఫ్రెండ్‌ టీ ప్యాలెస్‌లో ఐదు గృహ ఎల్‌పీజీ సిలెండర్లు, ఎస్‌ఎస్‌వీ టీ కేఫ్‌లో మూడు సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు స్థానిక సీఎస్‌డీటీలకు 15 సిలిండర్లు అప్పగించారు. ఈ మేరకు యజమానులపై నాలుగు 6–ఎ కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement