గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు 85, ఆఫీస్ సబార్డినేట్స్ 26, ల్యాబ్ టెక్నీషియన్స్ 20, ల్యాబ్ అటెండెంట్ 10, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 8, ఇలా 27 రకాల ఉద్యోగాలు జీజీహెచ్, వైద్య కళాశాలలో భర్తీ చేస్తున్నామన్నారు. ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు ఏప్రిల్ 2న సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను గుంటూరు మెడికల్ కళాశాలలో అందజేయాలన్నారు. డిస్ట్రిక్ట్ సెక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. విద్యార్హతలు, వేతనాలు, ఇతర వివరాల కోసం http: guntur.ap.gov.in లేదా www. gunturmedicalcollege.edu.in గుంటూరు మెడికల్ కాలేజ్.ఈడీయూ.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఏప్రిల్ 13న ఉద్యోగాలకు ఎంపికై న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రదర్శిస్తామన్నారు.
నరసరావుపేట టౌన్: చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నేషనల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా నరసరావుపేట కు చెందిన ప్రముఖ ఆడిటర్ చేకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామాక పత్రాన్ని గురువారం రీసెర్చ్ కమిటీ చైర్మన్ విశాల్ దోషి చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 449వ కౌన్సిల్ సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు రీసెర్చ్ కమిటీ 2026–27 పునఃవ్యవస్థీకరించారన్నారు.


