విద్యాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర కీలకం

Mar 27 2026 9:13 AM | Updated on Mar 27 2026 9:13 AM

విద్యాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర కీలకం ప్రభుత్వ బడుల్లో చిన్నారులను చేర్పించాలి సెంట్రల్‌ హాల్‌ పైలింగ్‌ పనులు ప్రారంభం మహనీయులు పొట్టి శ్రీరాములు రాష్ట్ర సరిహద్దులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల తనిఖీలు

మంగళగిరి టౌన్‌: విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రంథాలయాలు కీలకమని కేఎల్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రవీణ పేర్కొన్నారు. మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని గ్రంథాలయానికి గురువారం ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రంథాలయ భవనంలో రంగులు వేయడంతో పాటు గోడలపై విద్యాపరమైన, స్ఫూర్తిదాయకమైన చిత్రాలను చిత్రీకరించారు. గ్రంథాలయాలు శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దడం విద్యార్థులు, పాఠకులు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమేనని ప్రవీణ అన్నారు. తద్వారా గ్రంథాలయానికి ప్రజలు ఆకర్షితులవుతారని.. పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడెంట్‌ అఫైర్స్‌ డీన్‌ డాక్టర్‌ కేఆర్‌ఎస్‌ ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. సమన్వయకర్తగా ఫీల్డ్‌ కో ఆర్డినేటర్‌ పి. సురేష్‌ వ్యవహరించారు.

మంగళగిరి టౌన్‌: బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంగళగిరి ఎంఈఓ–2 బాబు తల్లిదండ్రులకు సూచించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అడ్మిషన్లను ఇచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానం, తల్లికి వందనం, మధ్యాహ్న భోజనం, పుస్తకాల పంపిణీ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో పూర్తిస్థాయిలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 ఉషాకుమారి, వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉషాలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాడికొండ: అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్‌ హాలుకు పైలింగ్‌ పనులను ప్రత్యేక పూజలు చేసి మంత్రి నారాయణ గురువారం ప్రారంభించారు. నారాయణ మాట్లాడుతూ.. బీ+జీ+3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మిస్తున్నామన్నారు. భవనం పైన 250 మీటర్ల ఎత్తులో టవర్‌ ఉంటుందని తెలిపారు. సందర్శకులు టవర్‌ పైకి వెళ్లి అమరావతి మొత్తం చూసేలా డిజైన్‌ చేశామని అన్నారు. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్‌ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ భవనాన్ని నాలుగు భాగాలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. మంత్రి వెంట అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీ శ్రీనివాస్‌, అధికారులు ఉన్నారు.

తాడికొండ: భాష, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి ఆయన నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వంపై ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి సహకరిస్తున్న ట్రస్ట్‌కు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుండి రాకేష్‌ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను తెలియజేయడం కోసమే ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

విజయపురిసౌత్‌: అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం నాగార్జునసాగర్‌ వద్ద రవాణా శాఖ, పోలీస్‌, ఫైర్‌ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డ్రంకన్‌న్‌ డ్రైవ్‌, ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, పర్మిట్‌ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తావని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్‌ సీఐ నఫీజ్‌ బాష, ఎంవీఐ శేషారెడ్డి, విజయపురి సౌత్‌ ఎస్సై అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement