మాచర్ల రూరల్: భద్రాద్రి శ్రీ సీతారామ దేవస్థాన నిర్మాణంలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి తన స్వామి భక్తిని చాటుకుంటే.. మాచర్ల మండలం జమ్మలమడకలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి రామాలయాన్ని నిర్మించి రామభక్తిని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన షేక్ సైదా సాహెబ్ 1996 సంవత్సరంలో గ్రామ శివారులోని సుమారు ఎకరం స్థలంలో శ్రీసీతారామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తన భక్తిని చాటుకున్నాడు. ముస్లిం వ్యక్తివి.. హిందూ దేవుళ్లకు చెందిన రామాలయాన్ని నిర్మించటమేటంటూ పెద్దలు వారించినా వినకుండా శ్రీరామునిపై తనకున్న భక్తిని విడవకుండా ఆలయాన్ని నిర్మించాడు. సైదా సాహెబ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావటం విశేషం. సుమారు 8సంవత్సరాల క్రితం అనారోగ్యంతో షేక్ సైదా సాహెబ్ ఆలయ ప్రాంగణంలోనే మృతిచెందాడు. సాహెబ్ భక్తి భావాన్ని ఆదర్శంగా తీసుకొని.. ఆయన్ను తలచుకుంటూ గ్రామస్తులంతా ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తుంటారు.
ఆలయాన్ని నిర్మించి
మతసామరస్యం చాటిన సైదా సాహెబ్


