గతంలో పనిచేసిన ఇంజినీరింగ్ అధికారుల చేతివాటం
ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా ట్యాపులు ఏర్పాట్లు
ఇటీవల బయట పడిన అసలు వ్యవహారం
సామాన్య ప్రజలకు వెళ్లే నీరు కూడా అపార్ట్‌మెంట్లకు మళ్లింపు
శివారు కాలనీలకు తగినంత నీరు అందక అవస్థలు
నగరపాలక సంస్థలో పెరుగుతున్న ఫిర్యాదులు
దొరికితే చర్యలు
ఇన్నర్ రింగ్‌రోడ్డులో అపార్ట్‌మెంట్లకు అనధికారికంగా అమరిక
నెహ్రూనగర్ దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆ విభాగంలో కింది స్థాయి సిబ్బంది దొంగ టెండర్లు వేయించి రూ. కోట్ల కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టిన విషయం తెలిసిందే. టెండరింగ్‌లో లెస్సుల పేరుతో మాయాజాలం చేసి జీఎంసీ ఆదాయానికి కన్నం వేసిన విషయాలను కూడా సాక్షి పలుమార్లు ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా అభివృద్ధి చెందుతున్న ఇన్నర్ రింగ్ రోడ్డులో అపార్ట్‌మెంట్లకు ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ట్యాపులు ఇచ్చేసి బిల్డర్ల వద్ద నుంచి రూ.లక్షలు దండుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిగో ఉదహరణ..
ఇన్నర్ రింగ్ రోడ్డులో గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే సదరు ఫ్లాట్‌కి ఇటీవల వాటర్ పైపులైన్ నుంచి నీళ్లు రావడం లేదని గమనించారు. రిపేరు చేయించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి తన అసెస్‌మెంట్ నంబర్ (ఇంటి పన్ను) చెప్పి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. సదరు అసెస్‌మెంట్ నంబర్ మీద కేవలం ఆస్తి పన్ను మాత్రమే చూపించింది. వాటర్ కనెక్షన్ లేదని నగరపాలక సంస్థ సిబ్బంది చెప్పారు. కంగుతిన్న యజమాని బిల్డర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరించారు. వాటర్ ట్యాపును రిపేర్ చేయించే బాధ్యత తనదని బిల్డర్ చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ఈ లెక్కన ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో ఒక వీధిలో అపార్ట్‌మెంట్ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే ఎన్ని దొంగ ట్యాపులు ఉన్నాయో తేలనుంది.
ఆ పేర్లతో పైపులైన్లు
ఇన్నర్ రింగ్ రోడ్డులో పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లు భారీగా వెలుస్తుంటాయి. అపార్ట్‌మెంట్‌లు సేల్ కావాలంటే తప్పనిసరిగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తప్పనిసరిగా ఉంటేనే కొనుగోలు చేస్తారు. అయితే సదరు అపార్ట్‌మెంట్ల బిల్డర్లుతో ఇంజినీరింగ్ అధికారులు కుమ్మకై పైపులైన్ వేయాలంటే డోనేషన్/కాంట్రీబ్యూషన్ ఇస్తే చాలని వారి వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేయడం..ఆ తరువాత వాటికి టెండర్ పెట్టి బిల్లులు చేసుకోవడం పరిపాటిగా మారిందనే చెప్పుకోవచ్చు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంట్‌లు పరిశీలించి దొంగ ట్యాప్‌లో ఉంటే డిస్‌కనెక్ట్ చేయడంతోపాటు సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– జి.వెంకటేశ్వరరావు , నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్


