నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు

Mar 26 2026 7:50 AM | Updated on Mar 26 2026 7:50 AM

ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం పరిశీలన మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ, ఎగువ సన్నిధులతో పాటు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులకు సంబంధించి హుండీ ఆదాయాలను బుధవారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి రూ. 16,74,302, దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి రూ. 25,06,239, శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రూ. 79,682, అన్నదానంకు రూ. 30,297 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వైకుంఠపురం శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షించారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ను బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పాట్‌ వాల్యూయేషన్‌ జరుగుతున్న తీరు, తెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూల్యాంకన విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్‌బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్‌ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వాల్యూయేషన్‌ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన సూచించారు. బుధవారం రెండో స్పెల్‌లో భాగంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్‌, సివిక్స్‌ సబ్జెక్టులకు ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. మూల్యాంకన విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రశ్నల కోడ్స్‌, ప్రశ్నపత్రం సరళి, మార్కుల వెయిటేజీ తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌ఐవో, స్పాట్‌ వాల్యూయేషన్‌ క్యాంపు అధికారి సునీత, సహాయ క్యాంపు అధికారులు, కోడింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ముప్పాళ్ళ: మైనర్‌ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక (13)ను యువకుడు(23) మాయమాటలు చెప్పి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా గమనించి తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. బుధవారం బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడాన్ని గమనించి మళ్లీ లైంగిక వేఽధింపులకు పాల్పడుతుండగా బాలిక సమీప బంధువులు యువకుడిని పట్టుకున్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రైతు సమస్యల పరిష్కారం ముఖ్యం

నరసరావుపేట రూరల్‌: నూతన సాంకేతిక పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి తోడ్పాటును అందించేలా ఏరువాక కేంద్రం పనిచేయాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి.శివన్నారాయణ తెలిపారు. మండలంలోని రావిపాడు ఏరువాక కేంద్రంలో జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ పంటలలో ఎదురయ్యే సమస్యలు, వాటి సమగ్ర నివారణ చర్యలు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం కార్యక్రమాలను రైతు స్థాయిలో సమస్యలకు అనుగుణంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement