ముంచెత్తుతున్న మురుగు
పొంగిపొర్లుతున్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాలువ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కుంచనపల్లి బైపాస్ రోడ్డుకు మురుగు నీటి ముంపు తీవ్రమౌతోంది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని నివాసాల నుంచి వెలువడే మురుగుతోపాటు ఇతర వ్యర్థాలు ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కాలువలోకి వచ్చి చేరుతున్నాయి. రైతులు కోతలు కోయడంతో కాలువలో మురుగు పంట పొలాల్లోకి రాకుండా ప్రాతూరు రోడ్డులోని అపర్ణ సమీపంలో కాలువకు అడ్డంగా కట్ట ఏర్పాటు చేశారు. కట్ట ఏర్పాటు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 2 కి.మీ. పొడవున ఉన్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్‌లో కుంచనపల్లి బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మురుగునీరు వచ్చి పంట కాలువలో చేరడంతో పొంగిపొర్లుతోంది.
పంట పొలాలకు తప్పని ముప్పు
మురుగు పంట పొలాల్లోకి వచ్చి చేరుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వద్ద మురుగు షెడ్డులోకి చేరుతున్నాయి. కుంచనపల్లి, ప్రాతూరు రోడ్డులో కుంచనపల్లి బ్రిడ్జి వద్ద నుంచి రైతులు కాలువకు అడ్డు వేసిన కట్ట వరకు సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో అరటి, పసుపు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఎక్కడైనా కాలువ కట్ట తెగితే ఆ మురుగు అంతా ఒక్కసారిగా వచ్చి పంటపొలాలను ముంచెత్తుతుందని, పండించిన పంటలు దేనికీ పనికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్‌కి మురుగు భారీగా వచ్చి చేరుతోందని రైతులు చెబుతున్నారు. కొన్నిప్రాంతాల వారు మురుగు ఎత్తి ఈ కాలువలోకి పంపిస్తున్నారని రైతులు అంటున్నారు. పలు బహుళ అంతస్తుల నుంచి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్‌కు మురుగు వచ్చి చేరుతోంది. ఆ కాలువకు అడ్డుకట్ట వేయడంతో అపార్ట్‌మెంట్లలో మురుగు వెనక్కి తంతున్నట్లు అపార్ట్‌మెంట్ వాసులు తెలుపుతున్నారు.
అర ఎకరంలో పసుపు పంట సాగు చేశా. కాలువలో మురుగు పొంగి పొర్లడంతో పసుపు పంట తడిసి పోయింది. దీని వల్ల పసుపు కుళ్లిపోతోంది. ఇప్పటికే మూడుసార్లు ఇలా జరిగింది. ఇది నాల్గవ సారి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మురుగుని మళ్లించే మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
–దాశెట్టి శంకరరావు, రైతు
ముంచెత్తుతున్న మురుగు
ముంచెత్తుతున్న మురుగు


