ఉత్సాహంగా స్వర్ణోత్సవ సంబరం
బాపట్ల: స్థానిక వ్యవసాయ కళాశాలలో విద్యనభ్యసించిన 1975–79 బ్యాచ్ విద్యార్థులు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం స్వర్ణోత్సవ సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆత్యందం ఆహ్లాదకరంగా గడిపారు. ఒకరినొకరు కుశల ప్రశ్నలతో పలకరించుకున్నారు. సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్న ఉద్వేగంతో ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మొత్తం 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ సమ్మేళనంలో నలుగురు మహిళలు కూడా ఉండటం విశేషం. ఇక్కడ చదివిన అనంతరం వైద్య విద్యనభ్యసించిన నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు, అఖిల భారత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై న నలుగురు అధికారులు, బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్లు, వివిధ రంగాల్లో నిష్ణాతులై తమ పదవులకు వన్నె తెచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి రిటైర్ అయిన వారు ఉన్నారు. వీరంతా ఆదివారం వ్యవసాయ కళాశాలలో కలుసుకున్నారు. విద్య నేర్పిన 12 మంది గురువులకు వేద పండితుల ఆశీస్సులతో పట్టు వస్త్రాలను బహూకరించి, ఘన సన్మానం చేసి గురుభక్తిని చాటుకున్నట్లు ఈ బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థి సంఘం నాయకులు జె.ధర్మారావు, పి.రాజశేఖరరావు తెలిపారు. చివరిగా ప్రస్తుత విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యానంతర ఉద్యోగావకాశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి, బోధన సిబ్బంది పాల్గొన్నారు.


