విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా పని చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల ప్రగతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మమేకమై వారి బాగోగుల గురించి వాకబు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1,049 పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో పీటీఎం 3.0 నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సంపూర్ణ ప్రగతి నివేదికలో విద్యార్థుల్లోని సమగ్ర నైపుణ్యాలు, భావోద్వేగాలు నమోదుతో పాటు పరీక్షల ద్వారా అభ్యాసన స్థితి అసెస్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన, ఎంఈవోలు ఎస్‌ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్, నాగేంద్రమ్మ, హెచ్‌ఎం ఆనంద కుమారి, తహసీల్దార్ మహబూబ్ సుభానీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సామాజిక స్పృహతోనే
వెట్టిచాకిరి నిర్మూలన ...
సామాజిక స్పృహతోనే వెట్టిచాకిరి వంటి వ్యవస్థలను నిర్మూలన చేయవచ్చని
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం 1976 నిఘా, అమలు కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశమందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి వెట్టిచాకిరి వంటి వ్యవస్థ లేకుండా చూడాలని అన్నారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ.గాయత్రి దేవి, డీఈఓ సి.వి. రేణుక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, సభ్యులు గండి కోటేశ్వర రావు, ఈమని చంద్ర శేఖర్, బెల్లంకొండ శంకర రావు తదితరులు పాల్గొన్నారు.
యూనిట్లు త్వరగా ప్రారంభించాలి..
వివిధ పథకాలు కింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక,ఎగుమతుల ప్రోత్సాహక మండలి (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశమందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ గత నెల రోజుల వ్యవదిలో 1047 దరఖాస్తులు అందగా 969 దరఖాస్తులకు మంజూరు చేసామన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహక ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం, పర్యాటక శాఖ అధికారి రమ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా


