బిలియర్డ్స్ పోటీల్లో సత్తా చాటిన క్లబ్ సభ్యులు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరులోని ఎల్వీఆర్ అండ్ సనన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత రెండు వారాలుగా జరుగుతున్న ఏపీ స్టేట్ బిలియర్డ్స్’ అండ్ స్నూకర్స్ ర్యాంకింగ్ పోటీలు బుధవారంతో ముగిశాయి. బిలియర్డ్స్ ఫైనల్స్‌లో విజేతగా ఎస్.శంకరరావు (శంకర్), రన్నర్‌గా ఎం.శ్రీనివాసరావులు నిలిచారు. ఇద్దరూ క్లబ్ క్రీడాకారులే కావడం గమనార్హం. తృతీయ స్థానంలో రాజమండ్రికి చెందిన గోవింద రాజరెడ్డి నిలిచారు. బహుమతి ప్రదానోత్సవలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, యాగంటి దుర్గారావు, ఉపాధ్యక్షుడు వణుకూరి శ్రీనివాసరెడ్డిలు ట్రోఫీలను అందజేశారు. పోటీల నిర్వహణ కార్యదర్శి పులివర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 14 రోజులుగా క్లబ్ నిర్వహించిన పోటీలు విజయవంతంగా ముగిశాయన్నారు. విజేతలకు రూ.లక్షల నగదు బహుమతులతోపాటు ట్రోఫీలను అందజేశామన్నారు. ఆధునిక సదుపాయాలతో బిలియర్డ్స్, స్నూకర్ బోర్డులపై పోటీలు ఏర్పాటు చేశామన్నారు. 1988లోనూ అంతర్జాతీయ బిలియర్డ్స్ క్రీడాకారుడు గీత్ సేథీ ప్రపంచ రికార్డును తమ క్లబ్‌లోనే సాధించారన్నారు. కార్యక్రమంలో కోశాధికారి ఏల్చూరు వెంకటేశ్వరరావు, సుశీల్, పాండు రంగారావు, శివాజీ, జి.స్వరాజ్ రావు, యు.అనిల్, ఎంవీ సురేశ్ బాబు పాల్గొన్నారు.


