సమాజ హితులకు సత్కారం
కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం
పెదకాకాని: దశాబ్దాల కాలంగా సమాజంలో ఆరోగ్య, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న సమాజ హితులను కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఘనంగా సత్కరించింది. మండలంలోని వెనిగండ్ల గ్రామ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రాంగణంలో బుధవారం జరిగిన సభకు కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ ఇవి నారాయణ అధ్యక్షత వహించారు.
● ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత 20 సంవత్సరాలుగా డాక్టర్ ఈవీ నారాయణ నేతృత్వంలో కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా రూ.2.50 కోట్ల స్కాలర్ షిప్‌లను ప్రతిభ గల పేద విద్యార్థులకు అందించడం హర్షణీయమన్నారు. అలాగే పేద ప్రతిభ గల విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
● కౌండిన్య ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవీ నారాయణ ప్రసంగిస్తూ గత 20 సంవత్సరాలుగా కోట్లాది రూపాయలను విరాళంగా అందించి ప్రతిభ గల పేద విద్యార్థులకు తోడ్పాటును అందిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
● ఈ సందర్భంగా గత రెండు దశాబ్దాలకు పైగా గుంటూరు నగరంలో ఎస్‌హెచ్‌ఓ ద్వారా ఆరోగ్య సేవలను అందిస్తూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులుగా ఎంపికై న డాక్టర్ టి.సేవకుమార్, ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందిన చిలకా చంద్రమౌళి, వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా ఎంపికై న అనంత లక్ష్మీనారాయణ, యుక్త వయసులోనే అభయ హస్త ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను ప్రారంభించి ఆర్థిక సలహాలను అందిస్తున్న సింహాద్రి నాగ వెంకట శివప్రసాద్‌లను కౌండిన్య ఐఏఎస్ అకాడమీ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. టీజేపీఎస్ కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ వి.సింగారావు, డాక్టర్ పోతురాజు శ్రీనివాసులు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ధనుంజయరెడ్డి, ట్రస్ట్ సభ్యులు వాకా రాంగోపాల్ గౌడ్, వడ్డెంకుంట సుబ్బారావు, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు, డి.సత్యనారాయణ, తాతా సాంబశివరావు, వీరంకి రంగారావు పాల్గొన్నారు.


